గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్. ప్రజ్ఞానంద
సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను భారత చెస్ క్రీడాకారుడు, యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద గెలుచుకునిఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.ఫైనల్‌లో ప్రజ్ఞానంద అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి అమెరికా స్టార్ ఫాబియానో కరువానాను 15-13 తేడాతో ఓడించారు. ఒక దశలో ఆరు పాయింట్ల వెనుకబడ్డప్పటికీ, ఒత్తిడికి తలొగ్గకుండా అద్భుతంగా పుంజుకుని టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కరువానా ఆధిక్యంలో ఉండటంతో ప్రజ్ఞానందకు సవాల్ మరింత కఠినంగా మారింది. ముఖ్యంగా క్లాసికల్ గేమ్స్‌లో కరువానా ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే చివరి రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజ్ఞానంద తన అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్‌లలో విజయం సాధించాడు. దీంతో ప్రత్యర్థిపై ఉన్న ఆరు పాయింట్ల లోటును పూడ్చుకుని ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత బ్లిట్జ్ గేమ్స్‌లోనూ తన ఆధిక్యాన్ని కొనసాగించాడు. కీలకమైన బ్లిట్జ్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో, మొత్తం స్కోరు 15-13గా నిలిచింది. దీంతో ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. ఫైనల్‌లోని తొలి క్లాసికల్ గేమ్ కరువానాకు అనుకూలంగా సాగింది. ప్రజ్ఞానందపై 6-0 తేడాతో విజయం సాధించి కరువానా భారీ ఆధిక్యం సాధించాడు. రెండో క్లాసికల్ గేమ్ మాత్రం డ్రాగా ముగిసింది. ఈ గేమ్‌లో ఇరువురు ఆటగాళ్లు 3-3 పాయింట్లు సాధించారు. దీంతో చివరి రోజు ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ప్రజ్ఞానంద ఆరు పాయింట్ల లోటుతో బరిలోకి దిగాల్సి వచ్చింది. కానీ చివరి రోజు భారత యువ గ్రాండ్‌మాస్టర్ అద్భుతమైన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించారు. మొదటి బ్లిట్జ్ గేమ్‌లో ప్రజ్ఞానందకు గెలిచే అవకాశం వచ్చినప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కరువానాకు అవకాశాలు లభించాయి. అయితే ఆ అవకాశాలను కరువానా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరకు గేమ్ డ్రాగా ముగిసింది. ఈ ఫలితం ప్రజ్ఞానందకు టైటిల్ రేసులో కీలకంగా మారింది. తర్వాతి గేమ్స్‌లో ప్రజ్ఞానంద తన నియంత్రణను కొనసాగిస్తూ అవసరమైన పాయింట్లను సాధించారు. చివరికి 15-13 తేడాతో కరువానాను ఓడించి గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను అందుకున్నారు. ఈ విజయంతో ప్రజ్ఞానంద భారత చెస్ చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద చిన్న వయసులోనే అంతర్జాతీయ చెస్‌లో తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్న ప్రజ్ఞానంద, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.