3

ఆగస్టు 26న 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్‌ చేయనున్న ఎంజీ మోటార్స్

దేశీయ మార్కెట్లో ఆగస్టు 26న ఎంజీ మోటార్స్ తీసుకొస్తున్న సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్‌కు ముందే లీకైంది. ఓ టీవీ యాడ్ షూటింగ్‌లో ఎలాంటి ముసుగు లేకుండా కెమెరాకు చిక్కింది. చాలా రోజులుగా ఆన్‌లైన్‌లో 'హెక్టార్ హాక్' లేదా 'టోమాహాక్' పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ కారు గురించి నెట్టింట ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఇది కేవలం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ మాత్రమే అని నెటిజన్లు భావించారు. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ ఇదో పూర్తిస్థాయి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ అని తాజా ఫోటోల ద్వారా స్పష్టంగా నిర్ధారణ అయింది. గ్లోబల్ మార్కెట్లో విశేష ఆదరణ పొందిన వూలింగ్ స్టార్‌లైట్ 560 ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఎంజీ సంస్థ ఈ దేశీ మోడల్‌ను తీర్చిదిద్దింది. ఈ కారు ఆలీవ్ గ్రీన్ బాడీ, గ్లాస్ బ్లాక్ రూఫ్ డ్యూయల్-టోన్ కలర్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 4.7 మీటర్ల పొడవు, 2,810 మిమీ వీల్‌బేస్ కలిగి ఉండి, లోపల ప్రయాణికులకు ఎంతో విశాలమైన స్థలాన్ని ఇస్తుంది. కారు ముందు భాగంలో ఉన్న డ్యూయల్ హారిజాంటల్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో పాటు సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెట్టాయి. రూఫ్ రైల్స్, భారీ పానోరమిక్ సన్‌రూఫ్, స్విర్ల్ ప్యాటర్న్ డిజైన్ ఉన్న డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి మరింత ప్రీమియం ఫీల్‌ను అందిస్తున్నాయి. క్యాబిన్ లోపల టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఓ భారీ టచ్‌స్క్రీన్, డ్రైవర్ కోసం చిన్న డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉండనున్నట్లు కంపెనీ టీజర్ల ద్వారా తెలుస్తోంది. ఈ భారీ వాహనంలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీని పొందుపరిచారు. ఇందులో 56.7kWh, 69.2kWh అనే రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇవి సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో అనుసంధానమై ఉంటాయి. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెడితే ఏకంగా 500 కిలోమీటర్ల మేర నాన్‌స్టాప్‌గా ప్రయాణించవచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మన దేశంలో ఈ రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెస్తారా లేదా సింగిల్ బ్యాటరీ వేరియంట్‌కే పరిమితం చేస్తారా అనేది ఎంజీ అధికారిక లాంచ్ ఈవెంట్‌లో తేలనుంది.


Related Post

Previous
Next Post »