3

అర్నాబ్ తుఫానుపై అధికార యంత్రాంగంతో సీఎం చంద్రబాబు సమీక్ష

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను రాష్ట్రంపై చూపే ప్రభావం, భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు, వ్యవసాయం, విద్యుత్, ఇరిగేషన్, హోం, వైద్య ఆరోగ్య, పౌరసరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వాయుగుండం అక్టోబర్ 26 ఉదయానికి తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, అక్టోబర్ 27న అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం అక్టోబర్ 28న ఉదయం నుంచి మధ్యాహ్నం లోగా బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. కోనసీమ, యానాం, కాకినాడ తీర ప్రాంతాల పరిసరాల్లో తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు సమీక్షలో అధికారులు వివరించారు. తుఫాను కదలికలు, తీవ్రతలో వచ్చే మార్పులను నిరంతరం పరిశీలిస్తూ, తాజా వాతావరణ సమాచారాన్ని అనుసరించి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 27 ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వర్షపు నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి, నీటి తొలగింపునకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.

Related Post

Previous
Next Post »