ఓట్ బచావో - దేశ్ బచావో అభియాన్ : ఓటు చోరీని అరికట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అధ్యక్షతన బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓట్ బచావో.. దేశ్ బచావో అభియాన్ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ఆ హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ సచిన్ సావంత్, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడం సంతోష్ కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ ఓటు అనేది కేవలం ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకునే సాధనం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును, ప్రజా ప్రభుత్వాల పాలనా దిశను నిర్ణయించే కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధమని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ఓటు హక్కుకు భంగం కలిగించే ఏ చర్య అయినా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు చేరకుండా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చూడాలని, ఓటర్లకు తమ పేర్లను పరిశీలించుకునే అవకాశం కల్పించడంతో పాటు అవసరమైన సవరణలు చేసుకునేందుకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కుకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసి, ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఓటు బచావో.. దేశ్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
