బిస్లెరి డ్రింకింగ్ వాటర్ తాగడానికి సురక్షితం కాదు : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బిస్లెరి సంస్థకు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాను అధికారులు సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ పరీక్షలో నీటిలో బ్రోమేట్ అనే రసాయనం అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ నీటిని తాగడానికి సురక్షితం కాదని అధికారులు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై బిస్లెరి సంస్థ అప్పీల్ చేసుకుంది. దీంతో అదే నమూనాను మరో రిఫరల్ ల్యాబ్‌కు పంపించి మళ్లీ పరీక్షించారు. కానీ రెండో పరీక్షలో కూడా నీరు సురక్షితం కాదని తేలింది. ఈసారి నీటిలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. రెండు ల్యాబ్‌ల పరీక్షల్లోనూ లోపాలు బయటపడటంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం.. బిస్లెరి సంస్థపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో మరో సంస్థ అయిన ఆశా కన్ఫెక్షనరీ తయారుచేసిన చాక్లెట్ ఫిల్లింగ్ కుకీస్‌పై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకుంది. ఆ కుకీస్‌ను ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు లేబుల్‌పై పేర్కొనని కార్మోసిన్ అనే రంగు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా టార్ట్రజైన్ అనే రంగును అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినట్లు తేలింది. వీటితో పాటు సన్‌సెట్ ఎల్లో ఎఫ్సీఎఫ్ అనే రంగు పదార్థాన్ని కూడా గుర్తించారు. అయితే ఆ నిర్దిష్ట ఆహార వర్గంలో ఈ రంగును ఉపయోగించడానికి అనుమతి లేదు. దీంతో ఆ కుకీస్‌ను నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధమైనవి, తప్పుదారి పట్టించే లేబులింగ్ కలిగినవి, అసురక్షితమైనవిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటించింది. అంతేకాకుండా మార్కెట్లో ఉన్న సంబంధిత బ్యాచ్ ఉత్పత్తులన్నింటినీ వెంటనే వెనక్కి తీసుకోవాలని సంస్థను ఆదేశించింది.
