3

కూతురుకు ఇంటి పక్కనే ఉన్న కొంత భూమిని ఇచ్చిన తండ్రి : అది నచ్చక తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా లాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోగల్‌పూర్ గ్రామంలో ఆస్తిలో వాటా తగ్గిపోతుందనే కోపంతో ఓ కొడుకు 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా గది తలుపులు మూసేయడంతో ఆ వృద్ధుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. నవంబర్ 14న ఓ గదిలో వృద్ధుడి సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని డూడేశ్వర్ ఖోబ్రాగడేగా గుర్తించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన చిన్న కుమారుడు అనిల్ ఖోబ్రాగడేను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని వెల్లడైంది. డూడేశ్వర్ తన కుమార్తె అనుసూయకు ఇంటి పక్కనే ఉన్న కొంత భూమిని ఇచ్చారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చి ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తోంది. అయితే తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం చిన్న కుమారుడు అనిల్‌కు నచ్చలేదు. అక్కకు భూమి ఇవ్వడం వల్ల తనకు ఆస్తిలో వాటా తగ్గిపోతుందని భావించి తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా భార్యను, అక్కను తండ్రికి భోజనం ఇవ్వకుండా అడ్డుకునేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 13 రాత్రి అనిల్ తన తండ్రి గదిలోకి వెళ్లి ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత గది తలుపులు మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నడవడానికి కూడా సరిగ్గా వీలులేని వృద్ధుడు మంటల నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం అక్క తండ్రికి భోజనం ఇవ్వడానికి వెళ్తుండటాన్ని గమనించిన అనిల్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో తండ్రిని తానే కాల్చి చంపినట్లు అనిల్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీనితో నిందితుడిని జైలుకు తరలించారు.

Related Post

Previous
Next Post »