3

భోగాపురం హెడ్ క్వార్టర్‌గా వాణిజ్య విమాన సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్

ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఏర్పాటైన నూతన ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్ రాష్ట్ర విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. శ్రీనివాస్ చిలుకూరి నేతృత్వంలో రూపొందిన ఈ సంస్థ, అత్యాధునిక ATR 72-600 విమాన శ్రేణితో మే 2027 నుంచి తన వాణిజ్య విమాన సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన అనుసంధానాన్ని పెంచడం ద్వారా సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ ఎయిర్‌లైన్స్ అడుగులు వేస్తోంది. ఈ విమానయాన సంస్థ కార్యకలాపాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ లోని రెండు కీలక విమానాశ్రయాలు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. భోగాపురంలోని నూతన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్‌కు ప్రధాన బేస్ ఎయిర్‌పోర్ట్‌గా వ్యవహరించనుంది. అదేవిధంగా, రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ విమానాల పార్కింగ్, నిర్వహణకు ప్రధాన హబ్‌గా ఉపయోగపడనుంది. ప్రాథమికంగా 3 ATR 72-600 విమానాలతో సేవలను ప్రారంభించి, దశలవారీగా విమానాల సంఖ్యను విస్తరించాలని సంస్థ ప్రణాళికలు రచించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం - విజయవాడ - హైదరాబాద్ నగరాల మధ్య 45 నుంచి 60 నిమిషాల వ్యవధిలోనే చేరుకునేలా విమానాలను నడపాలని ప్రతిపాదించింది. దీనితో పాటు విజయవాడ - గోవా, అలాగే హైదరాబాద్ - భోపాల్ - పూణే కారిడార్లను కూడా తన నెట్‌వర్క్‌లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక ఎన్వోసీ, కేంద్ర హోం శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందిన ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్, ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఈ నూతన ప్రాంతీయ ఎయిర్‌లైన్స్ రాకతో ఉత్తరాంధ్ర , రాజధాని ప్రాంతాల మధ్య వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు మరింత ఊతం లభించనుంది.

Related Post

Previous
Next Post »