తెలంగాణలోని జడ్చర్ల పట్టణంలో ఊర్కొండ మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. హాస్టల్ వెనుకవైపు ఉన్న ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే కొద్దిసేపటికే పట్టణంలోని ఎం.కె. హాల్ సమీపంలో వారు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులు కనిపించకపోవడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో ఉదయం 5.40 గంటల సమయంలో ఇద్దరు విద్యార్థినులు ఆసుపత్రి ముందు నుంచి సింగల్ గడ్డ వైపు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అదృశ్యమైన విద్యార్థినుల్లో ఒకరు కొత్తపల్లి గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు మిడ్జిల్ మండలం బొమ్మరాజుపల్లికి చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న హాస్టల్ ప్రిన్సిపాల్ విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే పట్టణంలోని ఎం.కె. హాల్ సమీపంలో ఇద్దరు విద్యార్థినులు సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో హాస్టల్ భద్రత, సిబ్బంది పర్యవేక్షణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెల్లవారుజామున విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విషయం ఉదయం వరకు సిబ్బంది ఎందుకు గుర్తించలేదు? రాత్రి వేళ వార్డెన్ అందుబాటులో ఉన్నారా? ప్రహరీ గోడ దూకి వెళ్లే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే ప్రశ్నలు తల్లిదండ్రులు, స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులు హాస్టల్ నుంచి వెళ్లడానికి గల కారణాలు, అక్కడి పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
3
Beranda
› found safe near M.K. Hall
› telangana
› Two students climb over the boundary wall of the Mahatma Jyotirao Phule Women’s Hostel in Jadcherla
› జడ్చర్ల మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా హాస్టల్‌లో ప్రహరీ దూకి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు : ఎం.కె. హాల్ సమీపంలో సురక్షితం
Subscribe to:
Post Comments (Atom)
