పశ్చిమ బెంగాల్ లో ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతీ యువకులకు జనవరి 1 నుంచి ఆర్థికసాయాన్ని అందించనున్నట్లు, దీనికి అవసరమైన మార్గదర్శకాలు రూపుదిద్దుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా వెల్లడించారు. భరోసా కర్మసూచి పథకం కింద అర్హులైన నిరుద్యోగ యువత విద్యార్హత ప్రమాణాలను బట్టి ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. వీటితో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా సంస్థల నుంచి అర్హత సాధించిన డిప్లొమా హోల్డర్లను కూడా డిగ్రీ అభ్యర్థులతో సమానంగా పరిగణిస్తారు. వీరికి కూడా ప్రతి నెలా 2,000 రూపాయల భృతి చెల్లిస్తారు. డిగ్రీ, డిప్లొమా అర్హత లేని నిరుద్యోగ యువతకు కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. నాన్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఆర్థిక భృతి అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలని నిబంధన విధించారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన యువసాథి పథకానికి బదులుగా సువేందు సర్కార్ దీన్ని ప్రవేశపెట్టనుంది. ఉద్యోగ వేటలో ఉన్న యువతకు రోజువారీ ఖర్చులు, కాంపిటీటివ్ పరీక్షల శిక్షణ, ఇంటర్వ్యూలకు హాజరుకావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులకు ఈ నెలవారీ భృతి ఎంతగానో సాయపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది నిరుద్యోగులు ఆర్థిక భారం నుంచి కొంతవరకు ఉపశమనం పొందడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. పథకం అమల్లో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుతం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని భవిష్యత్తులో మరింత పెంచనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. 2028-29 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పెరిగిన భృతి అమలులోకి వస్తుంది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు అందించే సాయాన్ని 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచుతారు. అలాగే నాన్ గ్రాడ్యుయేట్లకు లభించే మొత్తం 1,500 నుంచి 2,000 రూపాయలకు పెరుగుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, దరఖాస్తుల నమోదు విధానం, అవసరమైన ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధుల బదిలీకి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
3
Beranda
› Bharosa Karmasuchi scheme
› national
› Unemployment Allowance to be Implemented from January 1
› west bengal
› పశ్చిమ బెంగాల్ లో జనవరి 1 నుంచి నిరుద్యోగ భృతి అమలు
Subscribe to:
Post Comments (Atom)
