3

ఆగి ఉన్న ట్యాంకర్ ను థార్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం నాతవలస టోల్ గేట్ దాటిన తర్వాత సుందరపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఆగి ఉన్న ట్యాంకర్ ని థార్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా విశాఖపట్నం జిల్లా మధురవాడ, తగరపువలస, భీమిలి ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఈ రోజు తెల్లవారుజామున 1 గంట సమయంలో AP 40 KL 0007 థార్ వాహనంలో శ్రీముఖలింగం వెళ్లి, తిరుగు ప్రయాణంలో భోగాపురం వైపు వస్తున్నారు. సుందరపేట వద్ద ఆగి ఉన్న ట్యాంకర్ లారీ OD 05 BE 5141 ని థార్ వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఢీకొన్న వేగానికి థార్ వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న ఐదుగురు వాహనంలోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.థార్ వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు, ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు, సిబ్బంది క్రేన్ల సహాయంతో బయటకు తీసి, పోస్టు మార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన తీరును ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి, విజయనగరం డీఎస్పీని దర్యాప్తు చేయాలని ఆదేశించారు.ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

Related Post

Previous
Next Post »