3

అనుమతి లేకుండా విచారణలకు సంబంధించిన రికార్డింగ్, ప్రసారంపై నిషేధం విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

ముందస్తు అనుమతి లేకుండా విచారణలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు రికార్డు చేయడం, ఫొటోలు, స్క్రీన్‌షాట్లు తీయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తిగా నిషేధించింది. అలాగే కోర్టు విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడం, వాటికి సంబంధించిన క్లిప్పింగ్‌లను అప్‌లోడ్ చేయడాన్ని నేరంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌లు, మెసేజింగ్ యాప్‌లలో ఈ దృశ్యాలను ప్రసారం చేయడం, షేర్ చేయడంపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులు, కోర్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఏపీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి అనధికారికంగా రికార్డింగ్, ప్రసారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. న్యాయస్థానంపై గౌరవాన్ని కాపాడేందుకు, విచారణల సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

Related Post

Previous
Next Post »