3

ముంపు పరిహారం డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ముంపు పరిహారం కోసం భర్తనే భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన గజ్జి మల్లికార్జున్ (23) పశువుల కాపరిగా జీవనం సాగిస్తుండగా, అతడికి మక్తల్‌కు చెందిన అంజమ్మ అనే యువతితో వివాహమైంది. కాగా రెండు నెలల క్రితం మల్లికార్జున్ శ్రీశైలం వెళ్లగా అతడికి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి బస్సులో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో శివ తరచూ మల్లికార్జున్ గ్రామానికి వస్తుండేవాడు. ఈ క్రమంలో మల్లికార్జున్ భార్య అంజమ్మకు అతడు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో మల్లికార్జున్ కుటుంబానికి ఉదండాపూర్ జలాశయం ముంపు బాధితుల జాబితాలో రూ.18 లక్షల పరిహారం వచ్చింది. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకుని ఆ డబ్బును అంజమ్మ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం ప్రియుడు శివతో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. ప్లాన్ ప్రకారం ఈ నెల 20న శివ కూలిపని ఉందని రాత్రి సమయంలో మల్లికార్జున్‌ను బయటకు పిలిపించాడు. బైక్ పై వెళ్లిన మల్లికార్జున్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆచూకీ కోసం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన మల్లికార్జున్ డెడ్ బాడీ సోమవారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో కూలీలకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా కుల్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. దీంతో అక్కడే ఖననం చేశారు. భార్య అంజమ్మే తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related Post

Previous
Next Post »