3

జమ్మూ కశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదులు : ఇంటెలిజెన్స్ నివేదిక

జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం సుమారు 65 మంది విదేశీ ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భారత నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని వెల్లడించాయి. వీరిలో దాదాపు 55 మంది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా లకు చెందిన వారిగా భద్రతా సంస్థలు అంచనా వేశాయి. మిగిలిన 10 మంది ఉగ్రవాదులు ఈ ప్రధాన సంస్థల మద్దతుతో నడిచే చిన్న ఉగ్రవాద గ్రూపులతో సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. లోయలో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ నుంచి వీరు చొరబడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత కొంతకాలంగా భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ఫలితంగా జమ్మూ కశ్మీర్‌లో స్థానిక (లోకల్) ఉగ్రవాదుల సంఖ్య ఇటీవల సున్నాకు (జీరోకి) చేరడం ఒక చారిత్రాత్మక పరిణామంగా నిలిచింది. స్థానిక యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకపోవడం ఉగ్ర నెట్‌వర్క్‌లకు గట్టి దెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో, ఎత్తైన పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో తలదాచుకున్న ఈ 65 మంది విదేశీ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసేందుకు భారత సైన్యం, సీఆర్పీఎఫ్ మరియు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా వేట ముమ్మరం చేశాయి. ఇందుకోసం అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో 80కి పైగా టెంపరరీ ఆపరేటింగ్ బేస్‌లను ఏర్పాటు చేసి, నిఘా మరియు కూంబింగ్ ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి.

Related Post

Previous
Next Post »