3

ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ముందుకు సాగాలని ప్రణబ్ ముఖర్జీ సూచించారు : ఎకనామిక్ టైమ్స్ బెంగాల్ అసెండ్స్ సదస్సులో సీఎం సువేందు అధికారి

కోల్‌కతాలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ బెంగాల్ అసెండ్స్ సదస్సులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ ను వీడి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ముందుకు సాగాలని ప్రణబ్ ముఖర్జీ సూచించినట్లు వెల్లడించారు.  ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఆయనను కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినట్లు చెప్పారు. అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ తనకు మార్గదర్శిగా, సలహాదారుగా వ్యవహరించారని పేర్కొన్నారు. మోడీతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. ప్రణబ్ ముఖర్జీ తనతో మాట్లాడుతూ.. మరొకరి నాయకత్వంలోనే కొనసాగాలనుకుంటున్నావా? లేక ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నీ రాజకీయ లక్ష్యాల దిశగా ముందుకు సాగాలనుకుంటున్నావా? అని ప్రశ్నించినట్లు సువేందు అధికారి వెల్లడించారు. రాజకీయంగా సొంతంగా ఎదగాలనుకునే వారు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించినట్లు గుర్తుచేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వ్యవస్థపైనా ప్రణబ్ ముఖర్జీ విమర్శలు చేసినట్లు సువేందు తెలిపారు. ఆ పార్టీ మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల నియంత్రణలో ఉందని, ఒక కంపెనీలో చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వ్యవహరించినట్లుగా పార్టీ నడుస్తోందని ప్రణబ్ వ్యాఖ్యానించినట్లు చెప్పారు. టీఎంసీలో కొనసాగితే పార్టీ నాయకత్వానికి లోబడి పనిచేయాల్సి వస్తుందని భావించిన సువేందు అధికారి, తన రాజకీయ భవిష్యత్తు కోసం స్వతంత్రంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. అయితే, ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్టులోనే మరణించారు. ప్రణబ్ ముఖర్జీని తాను కేవలం రాజకీయ సలహాదారుగానే కాకుండా సంరక్షకుడిగా కూడా భావించేవాడినని సువేందు అధికారి తెలిపారు. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే, ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందనే ప్రశ్నకు సువేందు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దివంగత నేతకు సంబంధించి మరో వివాదం తలెత్తడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలతోనూ ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు అప్పట్లో విమర్శలు కూడా చేశారు.

Related Post

Previous
Next Post »