హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలను వెలుగులోకి వచ్చాయి. ఆసుపత్రి పరిపాలన, కొనుగోళ్లు, బిల్లింగ్, క్యాంటీన్ నిర్వహణ, మ్యాన్ పవర్ సేవలతో పాటు రూ.25 కోట్ల విలువైన ఇంప్లాంట్ల నిల్వలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్, లేబర్ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది. తనిఖీలకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆసుపత్రి బిల్లింగ్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగులను డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లులను ప్రాసెస్ చేసినట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో రోగి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడైంది. ఇందులో ప్రభుత్వం చెల్లింపులు చేసే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగుల కేసులు కూడా పలు ఉన్నట్లు సమాచారం.సర్జికల్ ఇంప్లాంట్ల కొనుగోలు, వినియోగంలోనూ నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఐదు ఆపరేషన్ థియేటర్లు, వాటి సబ్ స్టోర్ల సమీపంలో వెండర్లు అనధికారికంగా ఇంప్లాంట్లు, ఇతర వైద్య సామగ్రిని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిర్దేశించిన ఇండెంట్ విధానం పాటించకుండానే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నేరుగా వెండర్ల నుంచే ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు తేలింది. అలాగే సర్జికల్ వినియోగ వస్తువుల వాడకంలోనూ లోపాలు కనిపించాయి; ఒకే రోగికి వారం రోజుల్లోనే 800 గ్లోవ్స్ వాడినట్లు రికార్డుల్లో నమోదైంది. నిమ్స్ ప్రధాన క్యాంటీన్లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయని, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచారని తనిఖీల్లో గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏ (FSSAI) రిజిస్ట్రేషన్ లేకుండానే క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. క్యాంటీన్ టెండర్లలో అక్రమాలు, బిడ్డర్లు కుమ్మక్కైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కార్మిక చట్టాల ఉల్లంఘనలను కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు మెడికల్ షాపుల్లో మందుల విక్రయ రికార్డులను సరిగా నిర్వహించలేదని ఏసీబీ తేల్చింది. మెడికల్ షాపుల్లో రిజిస్టర్ కాని సిబ్బందిని నియమించినట్లు గుర్తించగా, మెడికల్ షాపుల కేటాయింపు టెండర్లపైనా ఏసీబీ పరిశీలన చేపట్టింది. 2019-2025 మధ్య కాలంలో మ్యాన్ పవర్ సేవల టెండర్ ప్రక్రియను పూర్తి చేయకుండానే కొనసాగించినట్లు ఏసీబీ గుర్తించింది. ఉద్యోగుల నియామకాలు, సెమీ స్కిల్డ్ కేటగిరీకి మార్పుల్లో నిబంధనలు ఉల్లంఘించారని, నియామక ప్రక్రియలో కుమ్మక్కయ్యారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపింది. సెక్యూరిటీ సేవల టెండర్ల ఖరారులో అసాధారణ జాప్యం జరిగిందని, కాంట్రాక్టులను పదే పదే పొడిగించినట్లు ఏసీబీ గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఒక సెక్యూరిటీ ఏజెన్సీ సమర్పించిన రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారెంటీని కూడా జప్తు చేయలేదని వెల్లడైంది.
3
Beranda › Posts filed under Major Irregularities Uncovered in Hospital Billing Process
Showing posts with label Major Irregularities Uncovered in Hospital Billing Process. Show all posts
Showing posts with label Major Irregularities Uncovered in Hospital Billing Process. Show all posts
Subscribe to:
Posts (Atom)
