ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు : జనసేనను తొక్కేయాలని చూస్తున్నారన్న ఓయూడీఏ చైర్మన్ షేక్ రియాజ్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల వేళ కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న చర్చ మొదలైంది. జనసేనను తొక్కేయాలని చూస్తున్నారంటూ ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, ఓయూడీఏ చైర్మన్ షేక్ రియాజ్ విడుదల చేసిన వీడియో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి అని చెబుతూనే జనసేన అభ్యర్థులకు ఎంతోకొంత నష్టం కలిగిస్తున్నారని షేక్ రియాజ్ తన వీడియోలో ఆరోపించారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న 18 మంది అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒంగోలు కార్పొరేషన్‌లో మొత్తం 62 డివిజన్లు ఉండగా, జనసేన అభ్యర్థులకు మద్దతుగా రియాజ్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తన వీడియోలో కూటమి మేయర్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కూటమి అభ్యర్థులందరికీ మద్దతు ఇవ్వాల్సిన సమయంలో జనసేన అభ్యర్థుల గెలుపుపైనే రియాజ్ దృష్టి సారించడం వెనుక రాజకీయ ఉద్దేశాలపై చర్చ జరుగుతోంది. అయితే, జనసేన అభ్యర్థులకు నష్టం కలిగిస్తున్నారన్న రియాజ్ ఆరోపణలపై కూటమి నేతల స్పందన తెలియాల్సి ఉంది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు కూటమి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

No comments:

Post a Comment

3