Tuesday, October 20, 2026

అక్టోబర్ 27న షావోమీ రెడ్‌మీ K100 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

చైనాలో అక్టోబర్ 27న షావోమీ రెడ్‌మీ K100 స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే రెడ్‌మీ K100 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆగస్టులో పరిచయం చేసిన సంస్థ తాజాగా స్టాండర్డ్ K100కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. కొత్త 'ఫ్లేమ్ గ్రీన్' కలర్‌లో మెటల్ ఫ్రేమ్, 'Sound by Bose' బ్రాండింగ్‌తో ఈ ఫోన్ కనిపించనుంది. రెడ్‌మీ K100లో 6.83 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 40కి పైగా మొబైల్ గేమ్స్‌లో 165fps మోడ్‌కు ఫోన్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. 480Hz మల్టీ-ఫింగర్ టచ్ రిపోర్టింగ్ రేట్, 3500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్ఠంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పాటు ప్రత్యేక D2 గేమింగ్ గ్రాఫిక్స్ చిప్‌ను ఇందులో అందించారు. ఈ డ్యూయల్ చిప్ సెటప్ ఫ్రేమ్‌రేట్‌ను స్థిరంగా ఉంచడంతో పాటు వేడిని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని షావోమీ తెలిపింది. 'హానర్ ఆఫ్ కింగ్స్' గేమ్‌లో 144fpsను కొనసాగిస్తూ సగటు పవర్ వినియోగాన్ని 1.1W తగ్గించినట్లు పేర్కొంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో హైపర్‌ఓఎస్ 4 అందించనున్నారు. రియల్‌టైమ్ అవసరాలకు అనుగుణంగా రిసోర్స్ కేటాయింపు, తరచుగా ఉపయోగించే యాప్స్ కోసం ప్రిడిక్టివ్ మెమరీ ప్రీలోడింగ్, సిస్టమ్ యాప్స్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లతో పనితీరును మెరుగుపరచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.