కేసీఆర్ ఫాంహౌస్‌కు కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీటిని మళ్లించిన వ్యవహారం : సమగ్ర విచారణ జరపాలని ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శికి లేఖ రాసిన ఎంపీ చామల

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కు కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీటిని మళ్లించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి శ్రీధర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించేందుకు ఉపయోగించడంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఎంపీ కోరారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి పాండురంగ చెరువుకు, అక్కడి నుంచి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించినట్లు వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రజాధనం ఎంత మేరకు దుర్వినియోగమైందనే విషయం వెల్లడవుతుందని చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నీటి మళ్లింపునకు సంబంధించి అనుమతులు, ప్రాజెక్టు నిర్వహణ, నిధుల వినియోగం వంటి అంశాలను పరిశీలించాలని కోరారు. ఈ వ్యవహారంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ శాఖను ఎంపీ కోరారు. ప్రజా అవసరాల కోసం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారనే ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరపాలని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

3