Monday, October 19, 2026

అక్టోబర్ 21 వరకు సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 21 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. జంతర్ మంతర్ వద్ద నిరసన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అరెస్టయిన వీరిద్దరూ ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. జంతర్ మంతర్ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి, గతంలో ఇచ్చిన శాంతి బాండ్లలోని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై దాస్, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్టోబర్ 14న వారిని ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తాజాగా ఈ గడువును అక్టోబర్ 21 వరకు పొడిగించారు. కోర్టు తాజా నిర్ణయంతో అప్పటివరకు వారు జైలులోనే కొనసాగనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు నిరసన చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా నిరసనకారులు బారికేడ్లను దాటి, నిరసనలకు అనుమతి లేని ప్రాంతంలోకి ప్రవేశించారనే ఆరోపణలు వచ్చాయి. జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమాలకు సంబంధించి అమల్లో ఉన్న ఆంక్షలను ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజామున దాస్, రాంకాలను అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.