Monday, October 19, 2026

అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు ఒకటి గిఫ్ట్ గా ఇస్తాను : ఎలాన్ మస్క్ ప్రకటన

అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు తన ఏరోస్పేస్ కంపెనీ 'స్పేస్ఎక్స్' నుంచి ఒక షేరును బహుమతిగా ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "వచ్చే ఏడాది, నేను అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్ఎక్స్ షేర్లలో ఒకటి గిఫ్ట్ గా ఇస్తాను. ఇది ఇలాంటి బహుమతులలో మొదటిది మాత్రమే అవుతుంది" అని మస్క్ పేర్కొన్నారు. 2025 జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు 72 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. స్పేస్ఎక్స్ షేర్ల ఇటీవలి ట్రేడింగ్ ధరల ఆధారంగా చూస్తే, ఈ భారీ పంపిణీ అంచనా విలువ దాదాపు 10.5 బిలియన్ డాలర్లు ఉండొవచ్చని నివేదికలు వస్తున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం మస్క్ ప్రస్తుత ఆస్తి దాదాపు 908.5 బిలియన్ డాలర్లు. 2002లో స్పేస్ఎక్స్ ను  స్థాపించిన మస్క్, కంపెనీ మొత్తం ఈక్విటీలో దాదాపు సగం వాటాను కలిగి ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం మస్క్ కు  పెద్ద భారం కాకపోవచ్చు. ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' తమ షేర్లలో 5 శాతాన్ని పబ్లిక్ బెనిఫిట్ ఫండ్ కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై స్పందిస్తూ, స్పేస్ ఎక్స్ షేర్లను నేరుగా ప్రజలకే ఇవ్వడం మంచిదని సిఫార్సు చేస్తూ మస్క్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మస్క్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. "నేను మనసులో ఇంకా చిన్నపిల్లాడినే, నాకూ ఒక షేరు కావాలి!" అని కొందరు సరదాగా కామెంట్ చేశారు. అంతరిక్ష నౌక స్టార్షిప్ను నిర్మిస్తున్న కంపెనీలో వాటా లభించడం వల్ల రాబోయే తరం మొత్తం అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి చూపుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ షేర్ల ద్వారా వచ్చే డబ్బును పేదరికాన్ని నిర్మూలించడానికి, మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగించాలని కొందరు సూచించారు.