Monday, October 19, 2026

హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టు రట్టు : పోలీస్ అధికారిని బురిడీ కొట్టించిన నిందితుడు : ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లను సృష్టించి, అమాయక యువకులను ఆకర్షించి, వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను అడ్టుపెట్టుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హానీ ట్రాప్ తో పోలీస్ అధికారిని సైతం బురిడీ కొట్టించినట్లు ఛార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. భారీ హనీట్రాప్ రాకెట్ కు  ప్రధాన సూత్రధారి అయిన కొండబత్తుల పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సోషల్ మీడియాలో యువతుల పేరుతో ఫేక్ అకౌంట్లను సృష్టించి యువకులతో పరిచయాలు పెంచుకునేవాడు. ఆ తర్వాత ప్రలోభపెట్టి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సేకరించి, వాటిని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేసేవాడు. యువకులను బెదిరించి వారి నుంచి సుమారు రూ.18 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా, వివిధ మార్గాల ద్వారా మరో రూ.7.16 లక్షలను మోసం చేసినట్లు గుర్తించారు. మొత్తంగా ఈ రాకెట్ ద్వారా రూ.25.16 లక్షల మేర డబ్బులు చేతులు మారినట్లు పోలీసుల తెలిపారు. బాధితుల్లో కేవలం స్థానికులు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశీయులు కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు మొత్తం 13 ఫేక్ ఇన్స్టాగ్రామ్, 14 ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. మోసాల కోసం రెండు వాట్సాప్ అకౌంట్లు, మూడు బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు గుర్తించారు. బాధితుల నుంచి సేకరించిన దాదాపు 82 మందికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ తో పాటు పలు కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.