ఐక్యరాజ్యసమితి కౌంటర్-టెర్రరిజం నివేదిక : ఐరాస తన ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న భారత్

ఐక్యరాజ్యసమితి కౌంటర్-టెర్రరిజం నివేదికలో భారతదేశంపై చూపిన పక్షపాతంపై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అండర్‌వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, ఐరాస తన ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఘాటుగా స్పష్టం చేసింది. ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ రూపొందించిన తాజా కౌంటర్-టెర్రరిజం నివేదికలో దావూద్ ఇబ్రహీం నాయకత్వంలోని ‘డీ-కంపెనీ’ని భారతదేశ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠాగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త రఘూ పూరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, వాస్తవ విరుద్ధమైన సమాచారంతో నివేదికలు ఇవ్వడం ఐరాస విశ్వసనీయతకే తీవ్ర హాని కలిగిస్తుందని హెచ్చరించారు. ఐరాస వేదికగా రఘూ పూరీ మాట్లాడుతూ కీలక విషయాలను గుర్తుచేశారు. దావూద్ ఇబ్రహీం భారత్ నుంచి ఎప్పుడో పారిపోయాడని, ప్రస్తుతం అతడు పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడని పునరుద్ఘాటించారు. గతంలో ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను కూడా పాకిస్థాన్‌లోనే గుర్తించి హతమార్చిన విషయాన్ని ఈ సందర్భంగా భారత్ ఐరాసకు గుర్తుచేసింది. 1993 బొంబాయి పేలుళ్ల కేసు సమయం నుంచే దావూద్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని, అతడు దేశం వెలుపల ఉన్నప్పుడే అల్-ఖైదాతో సంబంధాల కారణంగా 2003లో ఐరాస ఆంక్షల జాబితా (1267 సమితి)లోకి వచ్చాడని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు, మూకలు తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోవడానికి మానవ హక్కుల చట్రాన్ని వాడుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని భారత్ మండిపడింది. మానవ హక్కుల వేదికలు ఉగ్రవాదులకు, తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి రక్షణ కవచాలుగా మారకూడదని తేల్చిచెప్పింది. ఇదే సమయంలొ జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలపై పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలేనని ఐరాస వేదికగా స్పష్టమైన సంకేతం ఇచ్చింది.

No comments:

Post a Comment

3