Tuesday, October 20, 2026

కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపిన అన్నామలై : సీజేపీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే !

తమిళనాడులోని కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, 'వీ ది లీడర్స్' ఉద్యమ వ్యవస్థాపకుడు కె.అన్నామలై విలేకరులతో మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. సీజేపీ నిరసన పద్ధతులు, కొన్ని చర్యలతో తాను ఏకీభవించకపోయినా వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మాత్రం పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నిరసనకారులను అరెస్టు చేయడం, జైలులో వారు గడిపే సమయానికి సంబంధించి ఇబ్బందులకు గురిచేయడం వల్ల సీజేపీ నాయకులు మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ఈ విషయంలో వారు తప్పుడు పద్ధతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాక్రోచ్ జనతా పార్టీ పోరాటానికి అనూహ్యంగా ఆయన మద్దతు పలకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటన సందర్భంగా భారత్ అన్ని మతాల ప్రజలకు చెందిన దేశమని, ముస్లింలకు, ఇతర మతాల వారికి దేశంలో స్థానం లేదని ఏ హిందువు చెప్పినా అది పూర్తిగా తప్పేనని భగవత్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు అన్నమలై తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై, భారతీయ నాగరికతపై ఆసక్తి పెరుగుతోందని అన్నారు. ప్రపంచానికి భారత్ తన అత్యుత్తమ రూపాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని దేశ నాయకులు, పౌరులు కూడా ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ అవసరమని అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఈ ప్రక్రియ జరగాలని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. జనాభా నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం రహస్యంగా నిర్ణయాలు తీసుకోకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.