బాలీవుడ్ నటుడు ష్రాఫ్‌పై కాల్పులు : నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని తెలిపారు. కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించాయని వెల్లడించారు. వాటి ఆధారంగా కొంతమంది అనుమానితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా గుర్తిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేరానికి పాల్పడిన వారితో పాటు, దూరంగా ఉండి ఆదేశాలు జారీ చేస్తున్న వ్యక్తులనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ దాడికి సంబంధించిన కొంతమంది నిందితులు మహారాష్ట్ర వెలుపల, దేశం బయట కూడా ఉండే అవకాశం ఉందని ఫడ్నవీస్ తెలిపారు. ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారిని పట్టుకుంటామని చెప్పారు. విదేశాల్లో ఉన్న నిందితుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్ కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 

No comments:

Post a Comment

3