Monday, October 19, 2026

షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

హైదరాబాదుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితమే వివాహమైన ఆ యువకుడు జీవితంపై విరక్తితో భవనంపై నుంచి దూకాడు. ఈ హృదయ విదారక ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తమ్మిశెట్టి ప్రవీణ్ (34) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతనికి మూడు నెలల క్రితమే వివాహమైంది. కొంతకాలంగా ప్రవీణ్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. అయితే, ఇటీవల మార్కెట్‌లో నష్టాల కారణంగా అతను పెట్టిన డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. భారీ నష్టాల విషయం కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిస్తే పరువు పోతుందని తీవ్రంగా మదనపడ్డాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చైతన్యపురిలోని ఓ భవనంపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనతో ప్రవీణ్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.