Monday, October 19, 2026

అంతర్జాతీయ టి-20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సాధించిన భారత బౌలర్ నికీ ప్రసాద్ : తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టిన క్రికెటర్‌

భారత మహిళ క్రికెటర్ నికీ ప్రసాద్ అంతర్జాతీయ టి-20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. తన అంతర్జాతీయ బౌలింగ్‌ కెరీర్‌లో వేసిన తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టిన రెండో మహిళ క్రికెటర్‌గా, ఐసిసి ఫుల్ మెంబర్ జట్లలో తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. నికీకి ముందు అమెరికాకు చెందిన అనిసా రావ్ 2019లో బంగ్లాదేశ్‌పై తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి రెండు బంతుల్లోనే వికెట్లు తీసింది. తాజాగా నికీ ఆమె సరసన నిలిచింది. రాయ్‌పూర్ వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నికీ ఈ ఘనత సాధించింది. నికీకి అంతర్జాతీయ కెరీర్‌లో ఇది రెండో మ్యాచ్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌లోనే ఆమె బౌలింగ్ అరంగేట్రం చేసింది. జింబాబ్వే 14 ఓవర్లలో 75/3 స్కోర్ వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ స్మృతి మంధాన బంతిని నికీకి అందించింది. తొలి బంతికి నికీ ముగేరి-తిరిపానో (34)ను ఔట్ చేసింది. ఆ తర్వాత న్యాషా గ్వాంజురాను రెండో బంతికి పెవిలియన్ పంపింది. అయితే హ్యాట్రిక్ అవకాశం చేజార్చుకున్న నికీ.. మొత్తంగా రెండు ఓవర్లలో ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. ఈ దెబ్బకు జింబాబ్వే 20 ఓవర్లలో 102/8కే పరిమితమైంది. అనంతరం ఓపెనర్లు షఫాలి వర్మ (55), స్మృతి మంధాన (47 నాటౌట్) రాణించడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.