Monday, October 19, 2026

కరవు, ఎల్ నినో నివారణకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు : ఛైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణలో కరవు, ఎల్ నినో ప్రభావ పరిస్థితులను సమీక్షించి, వాటిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు సిఫారసు చేసేందుకు ప్రభుత్వం సోమవారం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు అత్యంత ప్రాధాన్యతనివ్వనుంది. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉన్నందున, గ్రామాల్లో తాగునీటి సరఫరా మరియు నీటి లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మరోవైపు తాగునీటి భద్రతతో పాటు నీటి సంరక్షణలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు (పర్కోలేషన్ పిట్స్), పంట కుంటలు (ఫార్మ్ పాండ్స్), ఊట చెరువుల నిర్మాణం మరియు నిర్వహణకు ప్రాధాన్యమిస్తోంది. నీటి వనరులను సంరక్షించడం ద్వారా భవిష్యత్తులో తాగునీటి కొరత రాకుండా నివారించడమే లక్ష్యంగా శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాబోయే వేసవికి ముందే గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది.