Monday, October 19, 2026

పల్లె పండుగ రోడ్డు ధ్వంసం : ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ : కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలో ప్రభుత్వ ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లె పండుగ కార్యక్రమం ద్వారా వేసిన రహదారిని ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి, ఆయన సహచరులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ధ్వంసం ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ. 4.75 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సహకారంతో దాదాపు 100 మీటర్ల మేర నూతనంగా నిర్మించిన రహదారిని ట్రాక్టర్‌తో దున్నేశారు. రోడ్డును ధ్వంసం చేసిన వారిపై తక్షణమే నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పవన్ ఆదేశించారు. ప్రజా ప్రయోజనాల కోసం వేసిన రోడ్డును నాశనం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ప్రత్యక్షంగా ఈ దారుణానికి పాల్పడిన వారితో పాటు.. వారి వెనుక ఉండి నడిపించిన రాజకీయ శక్తులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని తేల్చిచెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు ఎవరు నష్టం చేకూరుస్తున్నారో, అలాంటి వారి నిజస్వరూపాన్ని సమాజం మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిందితులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలని ఆదేశించారు. ధ్వంసమైన రోడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చయిందో అంచనా వేసి, ఆ పూర్తి నష్టాన్ని బాధ్యులైన వ్యక్తుల నుంచే రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజా మౌలిక సదుపాయాలను నాశనం చేసే సాహసం చేయకుండా ఈ చర్యలు ఒక గట్టి గుణపాఠంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.