Tuesday, October 20, 2026

ప్రేమ, కరుణ, దయ ఉద్యమానికి ప్రధాన బలాలు : పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో గడపాలి : కార్యకర్తలకు అభిజీత్ దీప్కే పిలుపు

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే  సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మనం, అదే ద్వేషాన్ని మనలోకి రానివ్వకూడదని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. సరైన దాని కోసం పోరాడుతున్న కార్యకర్తల ధైర్యం, ఐక్యతను ప్రశంసిస్తూ తమను రెచ్చగొట్టి ద్వేషంతో స్పందించేలా చేయాలనుకునే ప్రయత్నాలకు లొంగకూడదని, మనల్ని ద్వేషించే వారిలా మారాల్సిన అవసరం లేదన్నారు. ప్రేమ, కరుణ, దయ తమ ఉద్యమానికి ప్రధాన బలాలని, మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గంలో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. గత 10-12 రోజులుగా ఉద్యమకారులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. కొందరు వాలంటీర్లపై దాడులు జరిగాయని, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఉద్యమం కోసం కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాల ప్రభావం వారి కుటుంబాలపైనా పడుతోందని గుర్తుచేశారు. అందుకే పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో గడపాలని, వారి ఆందోళనను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న సౌరవ్ దాస్, అశుతోశ్ రంకా ఎదుర్కొన్న పరిస్థితులను అభిజీత్ ప్రస్తావిస్తూ సౌరవ్ జైలులో కొన్ని రోజులు గడిపి బయటకు వచ్చిన తర్వాత కూడా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. వారి కుటుంబాలు చూపుతున్న ధైర్యం తనకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. అశుతోశ్, సౌరవ్ తనకు సోదరుల్లాంటి వారని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారిద్దరి పాత్ర కీలకమని అభిజీత్ తెలిపారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని కోరారు.