ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు : ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగులను తొలగిస్తూ, ఆప్కాస్ ఎండి, జిల్లా కలెక్టర్ లకు లేఖలు పంపినట్లు నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రధాన కార్యాలయంలో ఆప్కాస్ విధానంలో అన్ స్కిల్డ్ వర్కర్‌గా పనిచేస్తున్న ఈదులమూడి సరోజినిదేవి తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 67వ వార్డు (శారద కాలనీ) నుండి కార్పొరేటర్‌ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారన్నారు. ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగంలో కొనసాగుతూ నామినేషన్ వేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధం కావడంతో, ఆమెను గుంటూరు నగరపాలక సంస్థ ఆప్కాస్ ఉద్యోగుల జాబితా నుండి తొలగించేందుకు ఆప్కాస్ మేనేజింగ్ డైరెక్టర్‌ కు లేఖ పంపామన్నారు. అలాగే, తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో ఆప్కాస్ విధానంలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అంజాతుల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ రాజాకీయ పార్టీ ఆభ్యర్దిని కలసి సంఘీభావం తెలిపడం, వారి వెంట బహిరంగ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ప్రాధమిక విచారణలో వెల్లడైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాబట్టి, సదరు ఉద్యోగిని కూడా ఆప్కాస్ జాబితా నుండి తొలగించి, ఆప్కాస్ ఎండీకి లేఖ పంపామని తెలిపారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ లేదా కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారాల్లో కానీ, రాజకీయ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్నా లేదా ఎన్నికల్లో పోటీ చేసినా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post