భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అమెరికాకు లేదు !

భారత పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అమెరికాకు లేదని స్పష్టం చేశారు. సుంకాలు విధించడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా వలస విధానంలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయని, భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని తెలిపారు. అమెరికా విధిస్తున్న సుంకాలు భారత్‌ను శిక్షించడానికి లేదా ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీయడానికి ఉద్దేశించినవి కావని రూబియో చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ఒత్తిడి తీసుకొస్తోందని, ఆ విదేశాంగ విధానంలో భాగంగానే కొన్ని సుంకాల నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. అయితే ఇలాంటి చర్యల వల్ల భారత్‌ వంటి కీలక భాగస్వామ్య దేశాలతో ఆర్థిక సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంగీకరించారు. భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంతో ముఖ్యమని, ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని రూబియో పేర్కొన్నారు. భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరగా ఉన్నామని రూబియో తెలిపారు. దీనికి నెలలు కాదు.. కొన్ని వారాలే పట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 99 శాతం పని పూర్తయిందని చెప్పారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అపార్థాలూ తలెత్తకుండా ప్రతి అంశంపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని వివరించారు. వాణిజ్య సంబంధాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం రెండు దేశాలకూ ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై భారతీయుల్లో నెలకొన్న ఆందోళనలను రూబియో ప్రస్తావిస్తూ ఈ మార్పులు భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కావని స్పష్టం చేశారు. అమెరికా వలస వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అమెరికాకు వచ్చే వారు చట్టబద్ధమైన విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. కొన్ని వీసా విభాగాల్లో భారతీయ దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా కారణమని వివరించారు.

No comments:

Post a Comment

3