ఇటలీలో హింసాత్మక నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టాలు : విధ్వంసానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 20 వేల యూరోల వరకు జరిమానా

ఇటలీలో హింసాత్మక నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఆందోళనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 20 వేల యూరోల వరకు జరిమానా విధించేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అల్లర్లలో పిల్లలు పాల్గొంటే వారి తల్లిదండ్రులపైనా నష్టపరిహారం చెల్లించే బాధ్యత పెట్టాలని నిర్ణయించింది. మైనర్ల విషయంలోనూ నిఘా, నిర్బంధ చర్యలను కఠినతరం చేసింది. మరోవైపు, మిలాన్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనంగా 500 మంది సైనికులను మోహరించనుంది. వారాంతంలో మిలాన్‌తో పాటు ఇటలీలోని పలు నగరాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 20న జరిగిన మంత్రిమండలి సమావేశంలో భద్రత, బాల నేరాల నియంత్రణకు సంబంధించిన డిక్రీకి ఆమోదం తెలిపింది. కొత్త డిక్రీ ప్రకారం, నిరసన ప్రదర్శనలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా చేరి రాళ్లు, బాణసంచా లేదా కర్రలు విసిరినా, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, గరిష్ఠంగా 20,000 యూరోల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ముఖాలను కప్పుకొని హింసకు పాల్పడటం, ఇతరులను గాయపరచడం వంటి సందర్భాల్లో శిక్షలు మరింత పెరిగేలా నిబంధనలు ప్రతిపాదించారు. గుంపులుగా ఏర్పడి ఆస్తులను ధ్వంసం చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియా ద్వారా హింసాత్మక నిరసనలను ప్రేరేపించే, నిర్వహించే వ్యక్తులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంబంధిత నేరం కింద దోషులుగా తేలిన వారికి 12 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయాల్లో మరో కీలక అంశం మైనర్ల పాత్ర. నిరసనల సమయంలో హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అనుమానించిన మైనర్లను ముందస్తుగా నిర్బంధించే నిబంధనలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాల న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనపు న్యాయమూర్తులు, నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. 14 ఏళ్లు దాటిన వారు చేసిన నేరాల విషయంలో, వారు తమ చర్యల గురించి అవగాహన కలిగి ఉన్నారనే ప్రాతిపదికన విచారణ సులభతరం చేసే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, దీనికి విరుద్ధమైన పరిస్థితులను నిరూపించే అవకాశం ఉంటుంది. పిల్లలు విధ్వంసానికి పాల్పడి ఆస్తులను ధ్వంసం చేస్తే, జరిగిన నష్టానికి పిల్లలతో పాటు తల్లిదండ్రులనూ ఆర్థికంగా బాధ్యులను చేసే అంశం కూడా డిక్రీలో ఉంది. సోషల్ మీడియాలో హింసాత్మక వీడియోలు చూసి కొందరు యువకులు చిన్నచిన్న గుంపులుగా ఏర్పడి విధ్వంసానికి దిగుతున్నారనే ఆందోళనను మెలోనీ వ్యక్తం చేశారు. వస్తువులను పగలగొట్టి, దుకాణాల్లో దొంగతనాలు చేసి, వాటిని వీడియోలు తీసి ప్రచారం చేయడం ప్రమాదకర ధోరణి అని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment

3