ముంబైలో కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ మరణం తాలూకు ప్రకంపనలు కొనసాగుతుండగానే ముంబైలోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ'  ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధేష్ పాటిల్ (19) అనే విద్యార్థి మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాహిల్‌ మృతిపై నిరసనలు, వివాదం ఇంకా సమసిపోకముందే ఐసిటి విద్యార్థి సిద్ధేష్ ఆత్మహత్య చేసుకోవడం క్యాంపస్‌లలో విద్యార్థుల భద్రతపై ఆందోళనలను మరింత పెంచింది. మాటుంగాలోని ఐసీటి క్యాంపస్‌లోని హాస్టల్ 5లోని రెండవ అంతస్తు గదిలో పాటిల్ మృతదేహాన్ని గుర్తించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించామని, దర్యాప్తు జరుగుతోందని ఇన్‌స్టిట్యూట్ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. 'ఆకస్మిక మరణం' కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రకటనలను నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. నాసిక్‌కు చెందిన సిద్ధేష్ పాటిల్ గత కొంతకాలంగా డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని అతడి సహచర విద్యార్థి తెలిపాడు. మంగళవారం రాత్రి అతడు తన ప్రాణాలు తీసుకుంటానని డాక్టర్‌కు తెలపడంతో, ఆ డాక్టర్ వెంటనే పాటిల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను సంప్రదించి సిద్ధేష్‌ను చూడమని కోరారు. అయితే, వారు గదికి చేరుకునే సరికే సిద్ధేష్ ప్రాణాలు కోల్పోయాడని, దసరా పండుగ సెలవుల వల్ల క్యాంపస్‌లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని తోటి విద్యార్థి పేర్కొన్నాడు.

No comments:

Post a Comment

3