Monday, October 19, 2026

మెటా సంస్థకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారికంగా అడ్వైజరీ జారీ

మెటా సంస్థకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఓ అడ్వైజరీ జారీ చేసింది. ప్లాట్‌ఫారమ్‌లలోని సిఫార్సు వ్యవస్థలు, కంటెంట్-ర్యాంకింగ్ అల్గారిథమ్‌లను సమీక్షించాలని స్పష్టం చేసింది. వినియోగదారులకు కేవలం ఒకే రకమైన, పరిమితమైన కథనాలు మాత్రమే ఎక్కువగా కనిపించేలా రికమండేషన్ సిస్టమ్స్ పనిచేయకూడదని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. సమాచారంలో తగిన వైవిధ్యం, విశ్వసనీయత ఉండేలా చూడాలని సూచించింది. పాత వీడియోలు, సంబంధం లేని దృశ్యాలు, సెలెక్టివ్‌గా ఎడిట్ చేసిన ఫొటోలను ప్రస్తుత సంఘటనలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే కంటెంట్‌ను అల్గారిథమ్‌ల ద్వారా విపరీతంగా ప్రచారం కాకుండా కట్టడి చేయాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, ప్రజల్లో ఆందోళన, హింసను ప్రేరేపించేలా ఉండే కంటెంట్‌ను త్వరితగతిన గుర్తించి సమీక్షించేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని 'మెటా'ను కేంద్రం కోరింది. ఐటీ నిబంధనలు-2021 ప్రకారం.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు సమయానికి తగిన సమాచారం అందించడంతో పాటు, చట్టపరమైన విచారణలో పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఈ అడ్వైజరీని తక్షణమే అమలు చేయాలని, తీసుకున్న చర్యలపై మంత్రిత్వ శాఖకు బదులు వెంటనే ఇవ్వాలని 'మెటా'ను కేంద్రం ఆదేశించింది.