'మైఖేల్' బయోపిక్ : చిత్ర నిర్మాణ సంస్థ లయన్స్ గేట్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన గోల్డెన్ గ్లోబ్స్ కమిటీ

హాలీవుడ్ పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' బయోపిక్ లో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ పోషించగా, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్ 2027 వేడుకలకు సంబంధించి ఈ సినిమాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాను 'మ్యూజికల్ లేదా కామెడీ' కేటగిరీలో చేర్చాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ లయన్స్ గేట్ చేసిన అభ్యర్థనను గోల్డెన్ గ్లోబ్స్ కమిటీ తిరస్కరించింది. ఫలితంగా ఈ సినిమా అత్యంత పోటీతో కూడుకున్న 'డ్రామా' విభాగంలోనే రేసులో నిలవాల్సి వస్తోంది. వెరైటీ కథనం ప్రకారం గోల్డెన్ గ్లోబ్స్ కమిటీ 'మైఖేల్' సినిమాను డ్రామా విభాగంలోనే ఉంచాలని తుది నిర్ణయం తీసుకుంది. డ్రామా విభాగంలో ఉత్తమ సినిమా కేటగిరీ కింద కేవలం ఆరు నామినేషన్ స్థానాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఈ చిత్రానికి తీవ్ర పోటీ ఎదురుకానుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ', లాస్ జావిస్ రూపొందించిన 'లా బోలా నెగ్రా' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు కూడా ఇదే కేటగిరీలో పోటీపడుతుండటంతో 'మైఖేల్' నామినేషన్ దక్కించుకోవడం సవాలుగా మారింది. అయితే ప్రధాన విభాగం మారినప్పటికీ ఉత్తమ సహాయ నటుడు, సహాయ నటి విభాగాల్లో పోటీ పడుతున్న కోల్మన్ డొమింగో, నియా లాంగ్‌ల అవకాశాలపై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. గోల్డెన్ గ్లోబ్స్ అధికారిక నిబంధనల ప్రకారం.. ఒక సినిమాను 'మ్యూజికల్'గా గుర్తించాలంటే కేవలం పాటలు ఉండటమే కాకుండా కథా గమనాన్ని ముందుకు నడిపించడంలో ఆ పాటలు, డైలాగ్స్ కీలక పాత్ర పోషించాలి. లయన్స్ గేట్‌కు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీల్ చేసుకోవడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఈ లోపు వారు సరైన వాదనలు వినిపిస్తే కమిటీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉంది. మరో వైపు ఈ అవార్డుల వివాదం నడుస్తుండగానే.. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీసుకురావడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం. మైఖేల్ జాక్సన్ మేనేజర్ జాన్ బ్రాంకా పాత్రలో నటించిన మైల్స్ టెల్లర్ కూడా సీక్వెల్ కథనాలపై గతంలో సూచనలు చేశారు. తన మేనమామ పాత్రలో జీవించిన జాఫర్ జాక్సన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైఖేల్ జాక్సన్ ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే ఆయన సంగీతాన్ని, పాటల సాహిత్యాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. మైఖేల్ రాసిన కవితలు, ఆయన సందేశాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన సేవా కార్యక్రమాలు, చిన్నపిల్లలతో ఆయన గడిపిన సమయం ఆయన అసలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో, జాన్ లోగన్ రచనలో ఏప్రిల్ 2026లో విడుదలైన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

3