రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనంగా మారింది : మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. తక్కువ వోల్టేజీతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరులో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. 24 గంటలపాటు మోటార్లు నడిపి 35 టీఎంసీల నీటిని ఎత్తాల్సి ఉండగా, కేవలం ఎనిమిది గంటలే మోటార్లు నడిపి 13 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తారని విమర్శించారు. గతంలో 30 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కేవలం 13 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడు లక్షల ఎకరాలకు నీరందించారని చెప్పారు. ప్రస్తుతం సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలమవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల్లో అందుబాటులో ఉన్న నీటిని తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుపోయిందని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే, ఏపీలో పంటలు ఎండిపోకపోవడానికి అక్కడి ప్రభుత్వం నీటిని సమర్థంగా వినియోగించుకోవడమే కారణమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనంగా మారిందని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని ఇతర రాష్ట్రాలు ముందుగానే విద్యుత్ కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించి, ఇప్పుడు విద్యుత్ అందుబాటులో లేదంటూ సాకులు చెబుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాలమూరు ప్రాంతంలో కరువుకు ఎల్‌నినో ప్రభావం కారణం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యమే కారణమని మండిపడ్డారు.

No comments:

Post a Comment

3