తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించి పలువురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించడం, నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఉక్కిరిబిక్కిరవుతున్న అన్నాడీఎంకేకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. మాజీ మంత్రులు షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని అన్నాడీఎంకే తిరుగువర్గం నేతలు బుధవారంనాడు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పళనిస్వామికి మద్దతు ప్రకటించారు. అయితే షణ్ముగం మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. అనంతరం అసెంబ్లీలో కలిసే పనిచేస్తామంటూ ఒక లేఖను స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు అందజేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదును పళనిస్వామి వర్గం వెనక్కి తీసుకుంది. పళనిస్వామితో సమావేశానంతరం మీడియాతో వేలుమణి మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో చీలిక లేదని, బేధాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పళనిస్వామికి తాము పూర్తి మద్దతిస్తున్నట్టు చెప్పారు. సమావేశానికి షణ్ముగం రాలేకపోయినా ఆయన అభిప్రాయం కూడా ఇదేనని, ఆయనను కలిసిన తర్వాతే ఇక్కడకు వచ్చామని చెప్పారు. తామందరం ఐక్యంగా ఉన్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ వేలుమణి, షణ్ముగం నాయకత్వంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు మద్దతుచ్చారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఫిరాయింపుల చట్టం కింద పదవి నుంచి తొలగించాలని స్పీకర్‌కు పళనిస్వామి వర్గం వినతిపత్రం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరడం, కలిసే అసెంబ్లీ పోరాడతామంటూ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
0 Comments