హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా రోప్‌వే !


హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి ప్రత్యామ్నాయంగా, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ  రోప్‌వే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తోంది. ఇప్పటివరకు కొండ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలకు మాత్రమే పరిమితమైన రోప్‌వేలను ఇప్పుడు నగర ప్రజారవాణాలో భాగంగా ఉపయోగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే వ్యవస్థగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి సమీప వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టారు. రోప్‌వే వ్యవస్థలో తీగలపై ప్రయాణించే ప్రత్యేక బాక్స్‌ లాంటి కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్‌లో ఆరు నుంచి పది మంది వరకు ప్రయాణించవచ్చు. ట్రాఫిక్‌ను తప్పించుకుని వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా వీటిని రూపొందిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో నగర రహదారులపై ఏర్పడే భారీ ట్రాఫిక్ సమస్యలకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో చారిత్రక గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో రోప్‌వే ద్వారా ప్రత్యేక అనుభూతిని కల్పించాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గాన్ని నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు సుమారుఆరు కిలోమీటర్ల మేర పొడిగించే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు.

Post a Comment

0 Comments