దేశీయ మార్కెట్లో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మిత్సుబిషి కార్ల విక్రయాలను నిలిపివేసినప్పటికీ, కంపెనీకి చెందిన వాహనాలకు ఇప్పటికీ సెకండ్‌హ్యాండ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పజెరో SUV తన ఆఫ్-రోడ్ సామర్థ్యం, డాకర్ ర్యాలీ వారసత్వం, దృఢమైన నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఆటోమొబైల్ అభిమానులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఈ ఐకానిక్ SUV తిరిగి రానుందనే సంకేతాలను మిత్సుబిషి అధికారికంగా ఇచ్చింది. మిత్సుబిషి తన సోషల్ మీడియా వేదికల ద్వారా "Pajero/Montero is ready to write its next chapter" అనే సందేశంతో పజెరో, మాంటెరో బ్రాండ్ల పునరాగమనాన్ని ధృవీకరించింది. కంపెనీ విడుదల చేసిన రోడ్‌మ్యాప్ ప్రకారం, పజెరో పేరు ఇకపై ఒక్క మోడల్‌కే పరిమితం కాకుండా పూర్తి స్థాయి SUV బ్రాండ్‌గా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్సుబిషి చివరిసారిగా 2021లో పజెరో పేరును ఉపయోగించింది. ఇప్పుడు ఆ పేరును కొత్త తరం మోడళ్లతో తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజా ప్రణాళికల ప్రకారం, కనీసం రెండు కొత్త పజెరో SUVలు అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి ప్రీమియం ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో కూడిన లాడర్-ఫ్రేమ్ SUVగా ఉండే అవకాశం ఉంది. టీజర్ చిత్రాల ఆధారంగా చూస్తే, కొత్త పజెరో SUVకు మిత్సుబిషి ట్రైటాన్ పికప్ ట్రక్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను అందించే అవకాశం ఉంది.
0 Comments