కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ పావగడలోని ఆ శాఖ కార్యాలయంలో ఉరి వేసుకున్నాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. దేవుడు అతడ్ని శిక్షిస్తాడని ఒక వీడియో షేర్ చేశాడు. ఆత్మహత్యకు ముందు మల్లికార్జున్ ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఆ శాఖ డైరెక్టర్ కృష్ణప్ప తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. తన కుటుంబం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. 'నా తల్లి, భార్య, పిల్లలు, నా కుటుంబం మొత్తం నన్ను ఎంతో బాగా చూసుకున్నది. వారు నాకు గౌరవం ఇచ్చారు. నేను వారికి సహాయం చేయాల్సి ఉంది. నేను వారికి ఇంకా ఎక్కువగా సహాయం చేయాలనుకున్నా. కానీ అది చేయలేకపోతున్నా' అని అందులో పేర్కొన్నాడు. మరోవైపు తన కుటుంబం ప్రతీకారం తీర్చుకోవద్దని మల్లికార్జున్ సూచించాడు. ఆ వ్యక్తిని దేవుడు, చట్టం శిక్షిస్తాయని తెలిపాడు. 'సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కృష్ణప్ప వేధింపుల వల్లే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దేవుడు అతడ్ని శిక్షిస్తాడు. అతడి కుటుంబ సభ్యుల తప్పు ఏమీ లేదు. కాబట్టి, నా కుటుంబ సభ్యులు వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు, చట్టం కచ్చితంగా అతడ్ని శిక్షిస్తాయి' అని అన్నాడు. ఆత్మహత్యకు ముందు మల్లికార్జున్ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను తన సహోద్యోగులకు షేర్ చేశాడు. దీంతో ఆ శాఖలో కలకలం రేపింది. పావగడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments