Ad Code

భార్య వేధింపులు తట్టుకోలేను, నాకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి : సూరత్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక దరఖాస్తు చేసిన వ్యక్తి


గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన కిరిత్ పటేల్ అనే వ్యక్తి, తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సూరత్ జిల్లా కలెక్టర్‌కు ఒక లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాడు. సుదీర్ఘ కోర్టు గొడవలు, నిరంతర మానసిక వేదనల వల్ల తనకు చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆ అర్జీలో ఆయన పేర్కొన్నాడు. కిరిత్ పటేల్ ఆరోపణల ప్రకారం ఇంట్లో చిన్నపాటి గొడవలు జరిగినప్పుడల్లా ఆయన భార్య మహిళా రక్షణ చట్టాలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతోంది. కావాలనే ఇంట్లో గొడవలు సృష్టించి, ఆ వెంటనే పోలీసులకు లేదా మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి భర్తను, ఆయన కుటుంబాన్ని ఇరికించేదని వాపోయాడు. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిరూపణ కావాల్సి ఉంది. కిరిత్ పటేల్‌కు ఇదివరకు జరిగిన పెళ్లి ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాబును చంపడానికి సైతం తన భార్య ప్రయత్నించిందని పటేల్ ఆరోపించాడు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా, వారు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వీరిద్దరి పెళ్లిళ్ల చరిత్ర ఇప్పుడు పోలీసులను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిరిత్ పటేల్‌కు, అలాగే అతని భార్యకు కూడా ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. వీరి వివాహం 2024 నవంబర్ 14న జరిగింది. పెళ్లయినప్పటి నుంచి తన భార్య, అత్త, ఆమె బంధువులు కలిసి డబ్బుల కోసం తనను తీవ్రంగా వేధిస్తున్నారని పటేల్ తెలిపాడు. నా భార్య కేవలం డబ్బుల కోసమే పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసే ముఠాకు చెందినది. గతంలో చేసుకున్న ఇద్దరు భర్తలను కూడా ఇలాగే కోర్టు కేసులు, భారీగా డబ్బుల డిమాండ్లతో వేధించి వదిలేసింది. ఇప్పుడు నన్ను కూడా అదే తరహాలో భరణం, గృహహింస కేసులతో వేధిస్తూ నరకం చూపిస్తోందంటున్నాడు. కుటుంబ కలహాలు, భార్యల వేధింపులు ఎదుర్కొనే పురుషులకు చట్టపరంగా ఎలాంటి రక్షణ లభించడం లేదని కిరిత్ పటేల్ తన దరఖాస్తులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కేవలం హామీలే ఇస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందాడు. అందుకే సూరత్ కలెక్టర్ కార్యాలయంలో కారుణ్య మరణం కోసం దరఖాస్తు ఇచ్చానని, ఈ మానసిక నరకం అనుభవించడం కంటే చావడమే మేలని ఆయన పేర్కొన్నాడు. 

Post a Comment

0 Comments

Close Menu