కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈడీ జరిపిన దాడులను తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మలుచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. “బీజేపీ ప్రభుత్వం విజయన్‌ను ఎందుకు టార్గెట్ చేయడం లేదు?” అని గతంలో పదేపదే ప్రశ్నించిన కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు ఎంత నిరాధారమైనవో ఈ దాడులతో రుజువైందని స్టాలిన్ ఈ సందర్భంగా చురకలంటించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయరాఘవన్, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి కలిసి కేంద్ర వైఖరిని ఎండగట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే విపక్షాలపై మోదీ సర్కారు దాడులను ముమ్మరం చేసిందని రాఘవులు విమర్శించారు. తమిళనాడులో గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని విజయ్ (టీవీకే అధినేత) సర్కారు ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్న తీరును, బీజేపీ వెబ్‌సైట్లు, ఎక్స్ ఖాతాలను మూసేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తున్న బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కలుపుకుని పోరాడతామని స్పష్టం చేశారు. కేరళ మాజీ సీఎం నివాసంలో ఈడీ సోదాలు స్పష్టమైన రాజకీయ కక్ష సాధింపు చర్యేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు. వామపక్షాలను భయపెట్టడం, సమాఖ్య సూత్రాలను నిర్వీర్యం చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పని, ఈ భయానక వాతావరణాన్ని తిప్పికొట్టేందుకు దేశంలోని ప్రజాస్వామ్య, లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయన్‌పై ఈడీ దాడులు రాజకీయ దురుద్దేశంతో కూడిన ప్రతీకార చర్యలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టాలనే కుట్రతోనే కేంద్రం ఈ పనులకు ఒడిగడుతోందని విమర్శించారు. “గడిచిన 12 ఏళ్లలో ప్రతిపక్ష నేతలపై కల్పిత కేసులు పెట్టి వేధించిన మోదీ ప్రభుత్వం.. వారిలో ఎంతమందిని బీజేపీలో చేర్చుకున్నాక పవిత్రులని సర్టిఫికేట్లు ఇచ్చిందో సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని, వీడియోల్లో దొరికిపోయిన వారికి సైతం బీజేపీలో చేరగానే ఉన్నత పదవులు, ముఖ్యమంత్రి పీఠాలు దక్కాయని, అయితే అంతిమంగా సత్యం, న్యాయమే గెలుస్తాయని తేజస్వీ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు బీజేపీ చేస్తున్న బరితెగింపు చర్యే ఈ దాడి అని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. విజయన్‌పై చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన తక్షణమే ఈడీ రంగంలోకి దిగడం చూస్తుంటే.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత సంబంధాలపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఇదే అంశంపై సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. కేరళలో కాంగ్రెస్-బీజేపీ కుట్ర బట్టబయలైందని విమర్శించారు. ఈడీ దాడుల సమయంలో సీపీఎం శ్రేణులు ఎంతో సంయమనం పాటించాయని, అయితే ఢిల్లీ పోలీసులు, కేరళ పోలీసులు, బీజేపీ మరియు కాంగ్రెస్ కలిసి తమ పార్టీని ఇరుకున పెట్టేందుకు భారీ వ్యూహం పన్నారని ఆరోపించారు. కేరళలో సీపీఎంను దెబ్బతీయకుండా రాజకీయంగా అడుగు పెట్టలేమని భావించే బీజేపీ.. కాంగ్రెస్ సహకారంతోనే పినరయి విజయన్ ఇల్లే లక్ష్యంగా ఈడీని పంపిందని సీపీఎం సీనియర్ నేత థామస్ ఐజాక్ విమర్శించారు. అయితే, ఈ దాడులు ఇటీవల ఎన్నికల ఎదురుదెబ్బల నుండి కోలుకుని, పార్టీ శ్రేణులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉధృత నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేలా కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.