బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ నంబర్ 3పై నిలిపి ఉంచిన అంత్యోదయ ఎక్స్ ప్రెస్ రైల్ లోని ఓ కోచ్ లో మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేరు. మధుబని స్టేషన్‌లో రైలును షంటింగ్ చేస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. రైలు పెట్టెల నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలు ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.