జూన్ 1 నుంచి తమ కార్ల ధరలను భారీగా పెంచనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ అధికారికంగా ప్రకటించింది. కార్ల మోడళ్లు, వాటి వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ. 12,800 వరకు ధరల పెంపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. నిజానికి మే నెల నుంచే కార్ల ధరలను ఒక శాతం వరకు పెంచుతామని హ్యుందాయ్ సంస్థ ఏప్రిల్ నెలలోనే ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని జూన్‌కు వాయిదా వేసింది. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారు జూన్ 1 కంటే ముందే నిర్ణయం తీసుకోకపోతే అదనపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ హఠాత్తు ధరల పెంపునకు గల కారణాలను కూడా హ్యుందాయ్ యాజమాన్యం వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ రంగానికి అవసరమైన ముడిసరకుల (ఇన్‌పుట్ కాస్ట్స్) ధరలు విపరీతంగా పెరగడం, దానికి తోడు కంపెనీ నిర్వహణ వ్యయం (ఆపరేషనల్ కాస్ట్స్) భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ తెలిపింది. గత కొంతకాలంగా పెరుగుతున్న ఈ అదనపు ఉత్పత్తి భారాన్ని కంపెనీయే భరిస్తూ వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ధరలను పెంచడం అనివార్యంగా మారిందని పేర్కొంది. భారతదేశంలో క్రెటా, ఐ20, వెన్యూ, ఎక్స్టర్ వంటి పాపులర్ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న తరుణంలో, హ్యుందాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి కొనుగోలుదారులపై ఎంతో కొంత ప్రభావం చూపనుంది.
0 Comments