కాక్రోచ్ జనతా పార్టీ' అకౌంట్ బ్లాకింగ్‌పై కేంద్రం, 'X' కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ !
సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ సంచలనం సృష్టించిన వ్యంగ్య ప్లాట్‌ఫారమ్ 'కాక్రోచ్ జనతా పార్టీ' అధికారిక 'X' (ట్విట్టర్) ఖాతా నిలిపివేత అంశం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. జాతీయ భద్రత మరియు దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉందనే కారణంతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ వ్యంగ్య అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే సామాజిక మాధ్యమ సంస్థ ‘X’ కు కీలక నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని పిటిషనర్ కోరగా, కోర్టు దానికి నిరాకరించింది. ఈ అంశానికి విస్తృత పరిణామాలు, తీవ్రమైన ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నందున.. కేంద్ర ప్రభుత్వం మరియు ‘X’ ల సమగ్ర స్పందన విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కేంద్రానికి 4 వారాల సమయం ఇస్తూ, తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేశారు. వ్యంగ్య అకౌంట్‌ను బ్లాక్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఐటీ చట్టం పరిధిలోని ‘రివ్యూ కమిటీ’ పునఃసమీక్ష జరపాలని హైకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రతి రెండు నెలలకొకసారి సమావేశమయ్యే ఈ ఉన్నత స్థాయి కమిటీ, ఈ బ్లాకింగ్ ఆర్డర్ వెనుక ఉన్న అన్ని సాంకేతిక, భద్రతాపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఆ నివేదికను కోర్టు రికార్డుల్లో ఉంచాలని జస్టిస్ పురుషేంద్ర కుమార్ ఆదేశించారు. పిటిషనర్ అభిజీత్ దిప్కే ప్రస్తుతం భారతదేశంలో లేనందున, ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించేలా ఏర్పాట్లు చూడాలని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు కోర్టు రూమ్ లైవ్ ప్రొసీడింగ్స్ సందర్భంగా నిరుద్యోగ యువత/ఆన్‌లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి వచ్చిన కొన్ని వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిరూపంగా మే మధ్యలో ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నెట్‌లో పుట్టుకొచ్చింది. మిల్లీనియల్స్, జెన్-జీ (Gen Z) యూజర్ల నుంచి దీనికి భారీ స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లోనే లక్షలాది మంది ఇందులో సభ్యులుగా చేరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో కూడిన పిటిషన్‌పై దాదాపు 6 లక్షల మంది సంతకాలు కూడా చేశారు. అయితే, వివాదాస్పద కంటెంట్ ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నివేదికల ఆధారంగా మే 21న ఈ అకౌంట్‌ను భారత ప్రభుత్వం బ్లాక్ చేయించింది.