ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరిత ఇంధన (గ్రీన్ ఎనర్జీ) హబ్‌గా మార్చడంలో భాగంగా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు 'గ్రీన్ ఎనర్జీ కారిడార్-3' కింద సుమారు రూ. 22,000 కోట్లతో రూపొందించిన భారీ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాబోయే ఆరు నెలల కార్యాచరణ, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాల పురోగతితో పాటు ప్రభుత్వ భవనాల సొలారైజేషన్ పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 కింద ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లను వేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ 18 గిగావాట్ల విద్యుత్‌లో సోలార్ ద్వారా 11 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 7 గిగావాట్లు ఉత్పత్తి కానుంది. ఈ మెగా ప్రాజెక్టు కోసం 9,500 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు భారీ పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెట్‌వర్క్ పూర్తయితే విశాఖ డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ అందుతుందని, తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు 200 మెగావాట్ల సామర్థ్యంతో సొలారైజేషన్ ప్రక్రియను రెస్కోమోడల్, నెట్ మీటరింగ్ విధానంలో ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద చిత్తూరు జిల్లాలోని 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేశారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2,898 స్కూళ్లు, హాస్టళ్లను 'నెట్ జీరో హెల్తీ క్యాంపస్'లుగా మార్చేందుకు గుర్తించారు. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఏపీ ప్రస్తుతం దేశంలోనే నాల్గో స్థానంలో ఉందని, దీనిని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, బీసీ వర్గాలకు రూ. 20 వేల సబ్సిడీతో 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు బిగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే ఏపీ ప్రభుత్వం, విద్యుత్ రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన 'ప్రవాహ్' సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సహకారంతో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే మొదటిసారిగా 'డిజిటల్ ట్విన్ గ్రిడ్'ను రూపొందిస్తున్నారు.
0 Comments