అమెరికాలో గుజరాత్ కు చెందిన 27 ఏళ్ల కావన్ కుమార్ పటేల్ అనే యువకుడు, మానవ అక్రమ రవాణాదారులతో చేతులు కలిపి ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు రుజువైంది. ఈ ఘోర నేరానికి గాను అమెరికా న్యాయస్థానం అతడికి 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించినట్లు యూఎస్ అటార్నీ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహా నగరంలో ఉన్న ‘అమెరిక్ఇన్’ అనే హోటల్లో కావన్ కుమార్ పటేల్ పని చేసేవాడు. గత ఏడాది జనవరి 2వ తేదీన ఈ హోటల్లో ఒక దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దొంగతనం కేసును దర్యాప్తు చేయడానికి అక్కడికి చేరుకున్న ఒమాహా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ టాస్క్ఫోర్స్ అధికారులకు అక్కడ ఊహించని దారుణం వెలుగుచూసింది. హోటల్ గదుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక భారీ లైంగిక అక్రమ రవాణా ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. అక్కడ బంధీలుగా ఉన్న 15, 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను టాస్క్ ఫోర్స్ అధికారులు సురక్షితంగా రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి వాణిజ్యపరమైన వ్యభిచారం కోసం ఆ బాలికలను అక్రమంగా తరలించి, ఈ హోటల్నే వారి స్థావరంగా మార్చుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుడైన కావన్ కుమార్ పటేల్ ప్రవర్తించిన తీరు అత్యంత క్రూరంగా ఉంది. కొందరు మానవ అక్రమ రవాణాదారులు సదరు మైనర్ అమ్మాయిలను తీసుకుని హోటల్ కు వచ్చినప్పుడు, వారికి తక్కువ ధరకే గదులు కేటాయించాలని హోటల్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. తాము ఇక్కడే ఉండేందుకు అనుమతిస్తే, ఆ బాలికలను వాడుకోవచ్చని ఎర వేశారు. దీనికి లోబడిన కావన్ కుమార్, హోటల్ కు చెందిన క్యాష్ బాక్స్ నుంచే డబ్బులు దొంగిలించి ఆ మానవ అక్రమ రవాణాదారులకు ఇచ్చాడు. ఆ తర్వాత హోటల్ గదిలోనే ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి సహకరించినందుకు, హోటల్ యజమాన్యానికి తెలియకుండా సదరు నిర్వాహకులను, బాలికలను చాలా రోజుల పాటు అక్కడే ఉండటానికి హోటల్ సిబ్బంది అనుమతించారు. ఈ మానవ అక్రమ రవాణా ముఠా ఆన్లైన్లో వివిధ రకాల ప్రకటనలు ఇస్తూ విటులను ఆకర్షించేవారని యూఎస్ అటార్నీ కార్యాలయం పేర్కొంది. అక్రమ రవాణాదారుల చేతికి చిక్కిన ఆ మైనర్ బాలికలకు కనీసం సరైన ఆహారం కూడా ఇవ్వకుండా తీవ్రంగా వేధించేవారు. వారు చెప్పినట్లు వినకపోతే మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తూ దయనీయ స్థితిలోకి నెట్టేసేవారని దర్యాప్తులో తేలింది. "నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ చిన్నారి పిల్లలను మా టాస్క్ ఫోర్స్ సకాలంలో రక్షించగలిగింది" అని యూఎస్ అటార్నీ లెస్లీ వుడ్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దర్యాప్తు ప్రక్రియలో నిందితుడు కావన్ కుమార్ పటేల్ అమెరికాలో చట్టబద్ధమైన వీసా లేకుండా అక్రమంగా నివసిస్తున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు అతడికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా, శిక్షా కాలం పూర్తి కాగానే ఒక్క రోజు కూడా అక్కడ ఉంచకుండా వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన అక్రమ రవాణాదారులైన ఎడ్వర్డో జోస్ పెర్డోమో, మైఖేల్ మార్టినెజ్ గోంజాలెజ్, ఆల్ఫ్రెడో జాంబ్రానో హుర్టాడోలతో పాటు.. ఈ దారుణంలో భాగస్వామ్యులైన సుమిత్ చౌదరి, విశాల్ గోస్వామి అనే మరో ఇద్దరు భారతీయ సంతతి హోటల్ ఉద్యోగులపై కూడా అమెరికా కఠిన చట్టాల ప్రకారం విచారణ జరిపి కఠినమైన శిక్షలు ఖరారు చేయనున్నారు.
0 Comments