మహారాష్ట్రలోని పూణే నగరంలో పోర్షే కార్ యాక్సిడెంట్ లో ఇద్దరు అమాయక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాణాలను బలిగొన్న నిందితుడు వేదాంత్ అగర్వాల్.. జైలుకు వెళ్లిన కేవలం 22 నెలల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇద్దరి మరణానికి కారణమైన కొడుకు జైలు నుంచి వస్తుంటే ఆ కుటుంబం సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నోట్ల కట్టల మాలలతో, డ్యాన్సులు చేస్తూ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024లో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల వేదాంత్ అగర్వాల్ అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి, దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో తన లగ్జరీ పోర్షే కారును రోడ్డుపైకి పరిగెత్తించాడు. ఆ మితిమీరిన వేగంతో బైక్‌పై వెళ్తున్న అశ్విని, అనీష్ అనే ఇద్దరు యంగ్ ఐటీ ఉద్యోగులను బలంగా ఢీకొట్టాడు. కారు వేగానికి ఆ ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మైనర్ కావడం, పైగా బడా బాబు కొడుకు కావడంతో వ్యవస్థను మేనేజ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. నిందితుడి బ్లడ్ శాంపిల్స్ మార్చడం, డ్రైవర్‌పై నెట్టేయాలని చూడటం వంటి ఎన్నో డ్రామాలు నడిచాయి. వీటికి తోడు ప్రమాదం జరిగిన కేవలం 15 రోజుల్లోనే కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. దాంతో అప్పట్లో ప్రజల నుంచి, మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కేసును రీ-ఓపెన్ చేసి, విచారణ జరిపి నిందితుడిని మళ్లీ జైలుకు పంపించారు. నిజానికి ఈ తరహా ఘోర నేరానికి చట్టప్రకారం కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉంది. కానీ, న్యాయస్థానాల్లోని లొసుగులు, కోట్లాది రూపాయల లాయర్ల వాదనల పుణ్యమా అని కేవలం 22 నెలలు తిరిగేసరికి నిందితుడికి మళ్లీ బెయిల్ లభించింది. జైలు నుంచి విడుదలైన వేదాంత్ అగర్వాల్‌కు అతని కుటుంబ సభ్యులు ఇంట్లో ఇచ్చిన వెల్‌కమ్ చూసి సోషల్ మీడియా షాక్ అయ్యింది. నిందితుడి మెడలో నోట్ల కట్టలతో తయారు చేసిన భారీ మాలలు వేశారు. బ్యాండ్ బాజాలతో, డ్యాన్సులు చేస్తూ సెలబ్రిటీ లాగా అతడిని ఇంట్లోకి ఆహ్వానించారు.
0 Comments