భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తన చావును కోరుకుంటోందని మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. కాగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం వినేశ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె పతకానికి దూరమైంది. ఆ తర్వాత రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఇటీవల తల్లిగా మారిన అనంతరం తిరిగి మ్యాట్‌పై అడుగు పెట్టాలనుకున్న ఈ హర్యానా అథ్లెట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో న్యాయపోరాటం చేసిన వినేశ్ ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొంది. అయితే, ఇక్కడా ఆమెకు చుక్కెదురైంది. ఎన్నో ఆరోపణలు, మరెన్నో పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వినేశ్ అనూహ్య రీతిలో సెమీఫైనల్లో పరాజయం పాలైంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల 53 కేజీల సెమీఫైనల్ బౌట్‌లో వినేశ్ 4-6 పాయింట్‌ల తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో 'నేను విఫలమయ్యానని భావించడం లేదు. నేను మ్యాట్‌పై కేవలం ప్రత్యర్థితో మాత్రమే పోరాడటం లేదు, మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. ప్రతి పాయింట్ కోసం ప్రాణం పెట్టాను. నాకు సరైన అవకాశం లభించలేదు. నాతో పోటీపడి గెలిచిన రెజ్లర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. వాళ్లు నాతో బౌట్‌లో పాల్గొనాలని కలలు కన్నారు. నేను తప్పక తిరిగి వస్తా' అని వినేశ్ భావోద్వేగానికి గురైంది. అదే సమయంలో.. 'నేను ఓడిపోయానని తెలిసి డబ్ల్యూఎఫ్‌ఐ అధికారులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. నా చావును కోరుకుంటున్నారు, నేను మొండిదాన్ని పర్లేదు, ఇప్పుడు వాళ్లను సెలబ్రేట్ చేసుకోనివ్వండి. నేను చాలా మొండిదాన్ని. నాకు పట్టుదల ఎక్కువ. ఇలాంటి చేదు అనుభవాలే నన్ను మరింత వేగంగా ముందుకు నడిపిస్తాయి. ఇవే నా ప్రయాణానికి ఇంధనాలు. నేను కచ్చితంగా తిరిగి వస్తా. నా ప్రతిభపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రదర్శనతోనే సమాధానం చెప్తా. నేను వీలైనంత త్వరగా చావాలని ఈ రెజ్లింగ్ సమాఖ్య కోరుకుంటోంది. ప్రస్తుతానికైతే వారి ఆలోచన ఇదే' అని వినేశ్ సంచలన ఆరోపణలు చేసింది.
0 Comments