దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఉద్యోగులు తమ రోజువారీ పనులను పూర్తి చేయడానికి, అలాగే కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టడానికి ఏఐ సాంకేతికతను భారీగా ఉపయోగిస్తున్నాయి. ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ బాడీ 'ACCA' నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ఉద్యోగులు ఏఐని చాలా వేగంగా అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే, ఈ టెక్నాలజీ తెస్తున్న మార్పులు ఒకవైపు ఉత్సాహాన్ని ఇస్తున్నా, మరోవైపు ఉద్యోగాల కోత లేదా లేఆఫ్స్ భయాలను కూడా తీవ్రం చేస్తున్నాయి. సర్వే ప్రకారం ఏఐ ఆధారిత రిక్రూట్‌మెంట్ పారదర్శకంగా , పక్షపాతం లేకుండా ఉంటుందని 52 శాతం మంది భారతీయ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇది ప్రపంచ సగటు (43 శాతం) కంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా యువతరం ఈ టెక్నాలజీని ఎక్కువగా విశ్వసిస్తోంది. 54 శాతం మంది జెన్-జీ యువకులు ఏఐ రిక్రూట్‌మెంట్‌ను సమర్థించగా, జెన్-వైలో 48 శాతం, సీనియర్ ఉద్యోగులైన జెన్-ఎక్స్ లో కేవలం 27 శాతం మంది మాత్రమే దీనిపై నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 57 శాతం మంది ఉద్యోగులు తమ ఆఫీస్ పనుల్లో ఏదో ఒక ఏఐ టూల్‌ను వాడుతున్నారు. అంతేకాదు, 86 శాతం మంది తాము కొత్త ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వడాన్ని పెంచాయి. 2025లో 37 శాతంగా ఉన్న ఈ సపోర్ట్, 2026 నాటికి 50 శాతానికి పెరిగింది. కానీ, ఈ పాజిటివ్ ట్రెండ్ వెనుక ఒక పెద్ద ఆందోళన దాగి ఉంది. సాంకేతికత మారుతున్న వేగం చూసి 53 శాతం మంది భయాందోళనలకు గురవుతున్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందేమో అని 57 శాతం మంది టెన్షన్ పడుతున్నారు. కంపెనీలు ఉద్యోగుల కంటే ఏఐ టూల్స్ పైనే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయని మూడో వంతు మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో ఏఐ వల్ల జరిగే కొన్ని నష్టాలను కూడా నిపుణులు ఎత్తిచూపారు. పలువురు యజమానులు మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో వచ్చే అప్లికేషన్లను ఫిల్టర్ చేయడానికి పవర్ బిఐ, పవర్ ఆటోమేట్, చాట్‌జిపిటి వంటి టూల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అయితే, ఇదే సమయంలో మంచి ప్రతిభ ఉన్న అభ్యర్థులను కూడా ఏఐ సిస్టమ్స్ పొరపాటున రిజెక్ట్ చేస్తున్నాయని, కాబట్టి ఫైనల్ డెసిషన్ ఎప్పుడూ మనుషుల చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ హాలూసినేషన్స్, డేటా ప్రైవసీ సమస్యలు కూడా కంపెనీలను కలవరపెడుతున్నాయి. ఈ ఏఐ ఎకానమీలో నిలదొక్కుకోవాలంటే అటు ఉద్యోగులు, ఇటు కంపెనీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులు ఏఐ వల్ల తమ ఉద్యోగం పోయే వరకు ఆగకుండా, ముందే ఆ టూల్స్‌ను ఎలా వాడాలో నేర్చుకుని, తమ పని సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అలాగే యజమానులు.. రొటీన్ , బోరింగ్ పనులను మాత్రమే ఏఐకి అప్పగించి, మనుషుల సృజనాత్మకత , విచక్షణ, బాధ్యత అవసరమయ్యేలా ఉద్యోగాలను రీడిజైన్ చేయాలి. టెక్నాలజీ చాలా వేగంగా దూసుకుపోతోంది. దానికి తగ్గట్టుగా సరైన గైడ్‌లైన్స్ నిర్మించుకుంటూ మనల్ని మనం అప్‌డేట్ చేసుకోకపోతే వెనుకబడిపోవడం ఖాయం,
0 Comments